
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, పాలనా విధానాలపై ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ సైకో.., శాడిస్ట్.. అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈటల చేసిన ఈ కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని ఎంపీ ఈటలను హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదనే ఫ్రస్టేషన్‌తోనే ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఈటల.. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటల తెలంగాణను ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.