
వరంగల్ : వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మించనున్న భూముల్లో పంటలు వేయొద్దని జిల్లా అధికారులు రైతులకు నోటీసులు పంపారు.సెక్షన్11 (1) ప్రకారం కలెక్టర్ ఆమోదించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
పరిహారం చెల్లింపు పూర్తిచేయకుండా హడావుడిగా సంతకాలు చేయించుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇది నగర అభివృద్ధి, రైతుల హక్కుల మధ్య సమతుల్యతకు సవాలుగా మారింది.
ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి, పరిహారం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.సెక్షన్ 11 (1) అనేది ఏదైనా ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి ప్రభుత్వం జారీ చేసే తొలి ప్రకటన.
ఇది భూమిని సేకరించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నట్లు తెలియజేస్తుంది. తదనంతరం భూమి విలువ నిర్ధారణ, పరిహారం చెల్లింపు, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వంటి ప్రక్రియలు ఉంటాయి.
అయితే.. మామునూర్ భూముల్లోని రైతులు పరిహారం చెల్లింపు ప్రక్రియను పూర్తిచేయకుండానే.. కొందరు రైతులతో హడావుడిగా సంతకాలు చేయించుకొని, పంటల సాగును ఆపమని నోటీసులు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా వర్షాకాలంలో పంటలు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ నోటీసులు రావడంతో
తమ వ్యవసాయ పనులు నిలిచిపోతాయనే ఆందోళన వారిని వెంటాడుతోంది.