
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి మంగళవారం రాత్రి తన బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నారు. ఈ పార్టీకి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన 22 మంది హాజరయ్యారు. అయితే అర్ధరాత్రి వేళ పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు సుమారు 12:45 గంటలకు చేవెళ్ల పోలీసులతో కలిసి త్రిపుర రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు.ఎలాంటి అనుమతులూ లేకుండా పుట్టిన రోజు పార్టీ నిర్వహించడం, మద్యం సరఫరా చేయడం, గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడడంతో మంగ్లీ సహా నలుగురిపై కేసు పెట్టారు.అక్కడ ఉన్న 22 మందిలో 9 మంది అనుమానితులకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో దామోదర్‌రెడ్డికి పాజిటివ్‌గా వచ్చింది. తాను మూడు రోజుల కిందట గంజాయి తీసుకున్నానని, ఈ పార్టీలో కాదని అతను పోలీసులకు తెలిపాడు.గాయని మంగ్లీతోపాటు ఆమె మేనేజర్ దున్న మేఘరాజ్, అతని స్నేహితుడు దామోదర్‌రెడ్డి, త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణలపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆరు ఖాళీ మద్యం సీసాలతోపాటు నాలుగు ఫుల్ బాటిళ్లు లభ్యమయ్యాయి.