
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
మూడు నెలల్లోగా అనగా సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ లో గడువు ముగిసినప్పటకీ ఏడాదిన్నర కాలంగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ తెలంగాణ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై బుధవారం నాడు జస్టిస్ మాధవి దేవి బెంచ్ విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు సమయం వంటి అంశాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి.
కోర్టు తీర్పుతో సర్పంచ్ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.