
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి రానున్న ప్రధాని మోదీ దాదాపు లక్ష కోట్ల రూపాయల పలు అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. అమరావతి పనుల పునః ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం రాత్రి 10 గంటలకు సభా వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ మరోసారి పరిశీలించారు. నేటి కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చే వారి కోసం 3531 ఆర్టీసీ బస్సులు, 4050 ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దూరప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
అసలే వేసవికాలం కావడంతో ప్రధాని మోదీ సభకు వచ్చే వారి కోసం ఆహారం, తాగునీరు, ORS సిద్ధం చేశారు. మొత్తం 8 మార్గాల ద్వారా రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రూపొందించారు. 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ నేడు అనుకోకుండా వర్షం పడినా, వచ్చిన ప్రజలు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ పార్కింగ్ ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంచారు.