
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు 10-05-2025 నుంచి ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా జరిగాయి. అందాల భామలు స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌తో అందంగా కనిపించారు. వారి ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేశారు.ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.హైదరాబాద్ నగర సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీదారులతో మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్‌ను నిర్వహించనున్నారు.ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమం నుమారు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ సందర్భంగా చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్‌గా ప్రమోట్ చేయనున్నారు.దీంతో పర్యాటకరంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశిస్తోంది. మే 31 వరకు కొనసాగే మిస్‌వరల్డ్ కార్యక్రమాల్లో సాధారణ ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.