
జమ్మూ కశ్మీర్ లోని షేర్-ఇ-కాశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(SKUAST)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 మంది తెలుగు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ డ్రోన్ల సాయంతో, క్షిపణులతో కశ్మీర్‌లోని ప్రజలు నివసిస్తున్న ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ శిబిరాలపై దాడి చేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు.ఎప్పుడు ఏమవుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు అక్కడి ఎయిర్ పోర్టులు మూసివేయడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ దుస్థితిని వివరిస్తూ 23 మంది తెలుగు విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు.కేంద్ర మంత్రి చొరవతో జమ్మూ కశ్మీర్ లోని యుద్ద ప్రాంతంలో చిక్కుకుపోయి ఆందోళనకు గురవుతున్న తెలుగు విద్యార్థులను జమ్మకశ్మీర్ అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది. తెలంగాణ, ఏపీకి చెందిన మొత్తం 23 మంది విద్యార్థులు కశ్మీర్ యుద్ద ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.